భారతీయ రైళ్లలో ‘‘ Economy Khana ’’ .. ధర ఎంతంటే ..?

 


భారతీయ రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్‌సీటీసీ) పలు కొత్త కొత్త విధానాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ రైళ్లలో జనరల్ క్లాస్‌లో ప్రయాణించే వారికి సరసమైన ధరలలో పరిశుభ్రమైన భోజనం, స్నాక్స్ అందించే ఉద్దేశంతో రైల్వే శాఖతో కలిసి పనిచేస్తోంది. నార్తర్న్ రైల్వే జనరల్ మేనేజర్ శోభన్ చౌధురి మీడియాతో మాట్లాడుతూ.. రైళ్లలో , స్టేషన్‌లలో ప్రయాణీకులకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ‘ఎకానమీ ఖానా’ అందించబడుతుందన్నారు. నాణ్యత , పరిశుభ్రత , ప్రమాణాలను నిర్ధారించడానికి ఎల్లప్పుడూ పర్యవేక్షణ వుంటుందని శోభన్ చౌధురి స్పష్టం చేశారు. 

వేసవిలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో వుంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఐఆర్‌సీటీసీ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. వేసవిలో ప్రయాణీకుల రద్దీ వుంటుందని, ముఖ్యంగా అన్‌రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించే వారు ఎదుర్కొంటున్న సమస్యలను తాము అర్ధం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. సామాన్య ప్రయాణీకులకు అనుకూలంగా వుండే pocket-friendly meal options అందుబాటులో వుండకపోవచ్చునని సదరు అధికారి అభిప్రాయపడ్డారు. 

ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ ‘‘ఎకానమీ మీల్స్’’, ‘‘స్నాక్ మీల్స్’’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.20, రూ.50గా సంస్థ పేర్కొంది. ఇవి ప్రయాణీకులకు సంతృప్తికరంగా వుంటాయని.. అయితే స్నాక్ మీల్స్ తేలికపాటి భోజనం అవసరమైన వారికి మాత్రమేనని ఐఆర్‌సీటీసీ తెలిపింది. సులభంగా యాక్సెస్ చేయడానికి ఫ్లాట్‌ఫాంలలోని అన్‌రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్‌ల వద్ద కౌంటర్‌లో ఈ భోజనం, తాగునీరు అందుబాటులో వుంచినట్లుగా పేర్కొంది. ప్రయాణీకులు నేరుగా ఈ కౌంటర్‌ల నుంచి తమ రిఫ్రెష్‌మెంట్‌లను కూడా కొనుగోలు చేయవచ్చునని.. స్టేషన్ వెలుపల దుకాణాలను వెతకాల్సిన అవసరం ఇకపై వుండదని ఓ అధికారి పేర్కొన్నారు. 

గతేడాది దేశవ్యాప్తంగా 51 రైల్వేస్టేషన్‌లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణీకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో 100 స్టేషన్‌లలో అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్, తిరుపతి, రాజమండ్రి, వికారాబాద్, పాకాల, డోన్, నంద్యాల తదితర స్టేషన్‌లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 


Comments